మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం జూరాల ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తిన అధికారులు వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 83 వేల క్యూసెక్కులు కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 85,098 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.42 మీటర్లు. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 9.42 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..
ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటినిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల నుండి 85,098 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంటుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 807 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 38.2358 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుండి 7,063 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు మరింతగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.