తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్..
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి..
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా మూడు రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఈ మూడు రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్‌లో పొందుపరచాలని చెప్పారు.
వివిధ రంగాల్లో అభివృద్ధి ఎలా ఉండాలో ప్రణాళిక..
హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయె రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవని చెప్పారు.
ప్రతీ రంగానికి సంబంధించిన పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టత..
సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్.. ఇలా ప్రతీ రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టత ఉండాలని సూచించారు. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ఆదేశించారు.
వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు..
తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదు అని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయండని అధికారులను ఆదేశించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.