సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియాకు సంబంధించిన ఒక వివాదంపై గురువారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ధర్మాసనం అభిప్రాయం ప్రకారం, సొంతంగా ఛానల్ ప్రారంభించినంత మాత్రాన ఎవరికీ జవాబుదారీగా ఉండననుకోవడం సరికాదు. అసభ్యకరమైన లేదా దేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ చేసి, అది వైరల్ అయినప్పుడు దానిని ఎలా నియంత్రిస్తారని, సదరు క్రియేటర్ బాధ్యత వహిస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని కేంద్రాన్ని నిలదీసింది.
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వినియోగదారులు సృష్టించే కంటెంట్‌ను నియంత్రించేందుకు సరైన నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఇది కేవలం అశ్లీలతకు సంబంధించిన అంశం కాదని, యూజర్ల కంటెంట్‌లోని లోపాలను ఇది ఎత్తిచూపుతోందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వక్రీకరించకూడదని పేర్కొన్నారు.