తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ (జీఎం) కె. సుబ్రహ్మణ్యంను గురువారం (నవంబర్ 27) అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అరెస్ట్ కాగా, టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ అరెస్టుతో కేసులో మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సిట్, కల్తీ నెయ్యి సరఫరాలో జీఎం సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని గుర్తించింది. కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడటంతో పాటు, నాణ్యత లేని నెయ్యి సరఫరాకు ఆయన సహకరించారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను విచారించగా వెల్లడైన వివరాల ఆధారంగా సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.
అరెస్టు చేసిన అనంతరం సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో మొదలైన దర్యాప్తు, ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది.