కల్ట్ డైరెక్షన్‌లో చిరంజీవి: మెగాస్టార్‌తో సినిమా చేయాలన్న ఉపేంద్ర డ్రీమ్

కన్నడ రియల్ స్టార్, విలక్షణ దర్శకుడు ఉపేంద్ర మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనే తన చిరకాల కోరికను మరోసారి వ్యక్తం చేశారు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవితో కలిసి పనిచేయడం తన బిగ్ డ్రీమ్ అని ఉపేంద్ర పేర్కొన్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ కల్ట్ డైరెక్టర్‌గా ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తే అది ఖచ్చితంగా చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

నిజానికి గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మాతగా చిరంజీవితో ఉపేంద్ర ఒక సినిమా చేయాల్సి ఉంది. ఉపేంద్ర చెప్పిన కొత్త ఐడియాలు చిరంజీవితో పాటు నిర్మాతకు నచ్చినా, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఆ కథలు లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని ఉపేంద్ర స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అప్పట్లో చిరంజీవి ఇమేజ్ అంచనా వేయలేకపోయానని, ఆయన్ను హ్యాండిల్ చేయాలంటే సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉండాలని, తన దగ్గర ఉన్న స్టోరీ ఆ స్థాయిలో లేదని, అందుకే మెగా ఆఫర్ మిస్సయిందని ఆయన తెలిపారు.

‘ఓం’, ‘ఎ’, ‘ఉపేంద్ర’, ‘సూపర్’, ‘ఉపేంద్ర 2’ వంటి ఆలోచింపజేసే కథాకథనాలు, విలక్షణమైన మేకింగ్ స్టైల్‌తో ఉపేంద్ర దర్శకుడిగా పేరు పొందారు. ఆయన క్రియేట్ చేసే పాత్రలకు, ప్రతీ సన్నివేశానికి డీప్ మీనింగ్ ఉంటుంది. అలాంటి విలక్షణ దర్శకుడు ఒకవేళ భవిష్యత్తులో మెగాస్టార్‌తో సినిమా చేస్తే, అది కచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందని, తెలుగు సినీ అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *