ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం గూగుల్ మీట్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు ఆన్‌లైన్ సమావేశాల్లో చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ సమస్యలతో పాటు, చాలామందికి “502 ఎర్రర్” అనే సందేశం కనిపిస్తుండటంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్య ప్రధానంగా భారత్‌లోని వినియోగదారులపై ప్రభావం చూపింది.
ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘డౌన్‌డిటెక్టర్’ నివేదిక ప్రకారం, సుమారు 65 శాతం మంది యూజర్లు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోగా, మరో 33 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ సాంకేతిక లోపం కారణంగా ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, ఇతర వర్చువల్ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో చాలామంది ఇతర ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూడాల్సి వచ్చింది.
ఈ అంతరాయంపై గూగుల్ స్పందించింది. తమ సర్వీసుల్లో సమస్య తలెత్తినట్లు కంపెనీ స్టేటస్ డ్యాష్‌బోర్డులో ధ్రువీకరించింది. అయితే, సమస్యకు గల కారణాలు, మరియు దాని పరిష్కారానికి పట్టే సమయంపై మాత్రం గూగుల్ స్పష్టత ఇవ్వలేదు.