గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అనే యువతి అమెరికా వీసా నిరాకరణతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్లో ఉంటున్న ఆమె, గత ఏడాది కాలంగా జీ1 వీసా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వీసా రాకపోవడంతో తన కలలు నెరవేరలేదనే బాధతో ఆమె నిద్రమాత్రలు అధిక మోతాదులో మింగి బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.
చదువులో రాణించలేకపోవడం, చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడే యువత సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, రోహిణి అమెరికాలోనే ఉద్యోగం చేయాలనే తన జీవితాశయంతో ప్రాణాలను తీసుకున్నారు. ఉన్నతమైన విద్యను అభ్యసించిన ఆమె, ఇండియాలోనే చక్కగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విదేశీ కల నెరవేరకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
వలసదారులపై ట్రంప్ కఠిన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో, విదేశీయుల రాకను అరికట్టాలని ప్రయత్నిస్తున్న కారణంగా అమెరికాపై ఆశలు వదులుకుంటున్న యువత ప్రత్యామ్నాయ దేశాల కోసం ప్రయత్నించడం మంచిదని ఈ వార్త సూచిస్తోంది. అమెరికా కల నెరవేరలేదన్న కారణంతో ప్రాణాలను తీసుకుని రోహిణి తన కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు.