గువాహటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా రక్షణాత్మక స్థితిలోకి జారుకుంది. మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 314 పరుగుల భారీ ఆధిక్యం సాధించగా, భారత్‌కు ఈ టెస్ట్‌లో గెలవడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో స్వదేశంలో టీమిండియాకు వరుసగా రెండో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ ఎదురవుతుందనే భయం అభిమానుల్లో పెరిగింది. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, ప్రయోగాలే అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 489 పరుగుల భారీ స్కోరు సాధించగా, భారత్ కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటింగ్‌లో యశస్వీ జైస్వాల్ (58), వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే రాణించారు. అగ్రశ్రేణి బ్యాటర్లు రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), పంత్ (7), జడేజా (6)లు తమ వికెట్లను సులభంగా సమర్పించుకున్నారు. ఈ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే సహా అభిమానులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు గెలవడానికి అవకాశం లేకపోవడంతో, నాలుగో రోజు డ్రా కోసం పోరాటం చేయడం ఒక్కటే మిగిలిన మార్గం. అయితే, సోషల్ మీడియాలో మాత్రం “గౌతమ్ గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలి” అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే, బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.