తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన, రాజకీయాలు కలుషితమయ్యాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో కూడా తనపై ఎలాంటి మరక పడకుండా ఉండడానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావే అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నుంచే నిజాయతీ, నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నానని వెల్లడించారు.
తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం ఎంతో ఉందని మంత్రి తుమ్మల అన్నారు. 1983 నుంచి తాను ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని, “ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల” అనే పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాముడి పాదాల చెంత ఎన్టీఆరే స్వయంగా తనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన క్షణాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తాను నిరంతరం రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
అలాగే, మంత్రి తుమ్మల తెలంగాణ రైతులకు శుభవార్త కూడా చెప్పారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతీ సీజన్‌కు రూ.6,000 చొప్పున, రెండు విడతల్లో ఈ సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.