పులివెందుల మాజీ సీఐ శంకరయ్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లీగల్ నోటీసులు పంపిన కొద్దిరోజుల్లోనే, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను సర్వీసు నుండి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే మేరకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా డిస్మిస్ ఆర్డర్‌ను ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అప్పటి సీఐ శంకరయ్య పేరును ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసే పనులు శంకరయ్య సమక్షంలో జరిగాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు శంకరయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, ₹1.45 కోట్లు పరిహారం చెల్లించాలని, అలాగే 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో, శంకరయ్య వ్యవహారంపై నివేదికలు సమీక్షించిన ఉన్నతాధికారులు, ఆయనపై ఉన్న క్రమశిక్షణా లోపాల కారణంగా సర్వీసు నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో (V.R.) ఉన్నారు.