టర్కీకి చెందిన ప్రముఖ సామాజిక, శాంతి కార్యకర్త తుర్కు అవ్సి, భారతదేశంలోని ముస్లిం మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం కంటే సాధికారత (Empowerment) వైపు దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటనలో ఒక మహిళా వైద్యురాలి పాత్ర ఉండటం చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని, తమ విశ్వాసం ఇలాంటి హింసాత్మక చర్యలను బోధించదని ఆమె అన్నారు.
నిజమైన సాధికారత విద్య, నాయకత్వం మరియు మంచితనం నుంచి వస్తుందని, కానీ హింస, రాడికలైజేషన్ వల్ల కాదని తుర్కు అవ్సి స్పష్టం చేశారు. భారతదేశంలోని ముస్లిం మహిళలు సాధికారత దిశగా ఆలోచన చేయాలని, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు వివిధ రంగాల్లో తమ స్థాయిని పెంచుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అసోం మాజీ ముఖ్యమంత్రి సయ్యదా అన్వారా తైమూర్ను ఉదహరించారు. అత్యున్నత స్థాయిలో ముస్లిం మహిళా నాయకత్వానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు.
ద్వేషంతో కూడుకున్న అన్ని భావజాలాలను తిరస్కరించాలని తుర్కు అవ్సి మధ్యప్రాచ్యం, యూరప్ మరియు భారతదేశంలోని ముస్లిం మహిళలకు విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్తు తరాలు ఇలాంటి హింసాత్మక వారసత్వాన్ని కోరుకోబోరని ఆమె స్పష్టం చేశారు. విశ్వాసం మరియు సాధికారత ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.