అఖండ 2: పాన్ ఇండియా సినిమా, సనాతన ధర్మ సందేశం: నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘అఖండ 2’ కేవలం ఒక తెలుగు సినిమా కాదని, ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం అని పేర్కొన్నారు. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘అఖండ 2’ సినిమా గురించి బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సీక్వెల్‌లో సనాతన హైందవ ధర్మం గురించి ఉంటుందని తెలిపారు. అలాగే, యువత పెడదారిలో పడకుండా, మంచి దారిలో నడవడానికి అవసరమైన సందేశం తన ప్రతి సినిమాలో ఉంటుందని, అటువంటి సందేశమే ఈ ‘అఖండ తాండవం’లో కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిల్లల జోలికి, ప్రకృతి, ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని ‘అఖండ 1’లో చూపించామని, ఈ సీక్వెల్ కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌పై బాలకృష్ణ ఆప్యాయత చూపించారు. తన సోదరుడిగా భావించే శివన్న (శివ రాజ్‌కుమార్) ‘మఫ్తీ’ లుక్‌ను తాను ‘వీర సింహా రెడ్డి’ సినిమా కోసం కాపీ కొట్టినట్లు బాలకృష్ణ సరదాగా తెలిపారు. అలాగే, తాను కేవలం నటుడినే కాదని, హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచానని, బసవతారక ఇండోమికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యాన్ని అతి తక్కువ ధరలకు అందిస్తున్నానని తన సామాజిక సేవ గురించి కూడా బాలకృష్ణ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *