దుబాయ్ ఎయిర్ షోలో విషాదం: తేజస్ యుద్ధ విమానం క్రాష్, పైలట్ నమన్ శ్యాల్ మృతి

అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు (IAF) చెందిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం వైమానిక విన్యాసాలు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్, వింగ్ కమాండర్ నమన్ శ్యాల్ (హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన వ్యక్తి) మృతి చెందారు. తేజస్ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. గతంలో 2024లో జైసల్మేర్ సమీపంలో తొలి ప్రమాదం జరిగింది.

ఘటనపై భారత వాయుసేన (IAF) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పైలట్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు భారత రక్షణ శాఖ తక్షణమే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి (Court of Enquiry) ఆదేశించింది. తేజస్ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.

పైలట్ నమన్ శ్యాల్ అకాల మరణంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశం ఒక ధైర్యవంతుడైన, సమర్థుడైన పైలట్‌ను కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నమన్ శ్యాల్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఇలాంటి ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *