హనుమంతుడి వివాదంలో రాజమౌళికి ‘హైపర్’ ఆది మద్దతు: హీరోల ట్రోల్స్‌పై కూడా స్పందన

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్‌లో హనుమంతుని గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయగా, ఈ ఇష్యూలో ఆయనకు నటుడు, కమెడియన్ ‘హైపర్’ ఆది నుంచి మద్దతు లభించింది. ‘ప్రేమంటే’ సినిమా వేడుకలో మాట్లాడిన హైపర్ ఆది, రాజమౌళిపై వచ్చిన విమర్శలను ఖండించారు. “ఆ రోజు ఆయన హనుమంతుడి మీద అలిగారు తప్ప అవమానించలేదు. ఈ ఒక్కటీ అందరూ గుర్తించాలి” అని ఆయన రాజమౌళికి అండగా నిలిచారు. రాజమౌళి తన సినిమాల కోసం భగవంతుడిని వాడుకుంటూ విమర్శలు చేయడం తగదంటూ సోషల్ మీడియాలో, కొంతమంది రాజకీయ నాయకులు మరియు హిందుత్వ వాదులు విరుచుకుపడిన విషయం తెలిసిందే.

హనుమంతుని వివాదం గురించి మాట్లాడుతూనే, సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందని హైపర్ ఆది మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అగ్ర హీరోలపై జరుగుతున్న ట్రోల్స్‌ను ప్రస్తావించారు. “ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్. బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్. అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్. ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్. రామ్ చరణ్ గారి ‘చికిరి చికిరి’ సాంగ్ మీద ట్రోలింగ్” అంటూ అనేక ఉదాహరణలను వివరించారు. ఈ విధంగా సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, విజయ్ దేవరకొండ లాంటి హీరోలపై తమ ఇండస్ట్రీ వ్యక్తులే ట్రోల్ చేస్తున్నారని, ‘అర్జున్ రెడ్డి’ వంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆయనకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేకుండా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారిపై డీప్ ఫేక్ వీడియో చేశారని గుర్తు చేస్తూ, ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. దేశం గర్వించేలా ‘బాహుబలి’ వంటి చిత్రాలు తీసిన రాజమౌళిపై, ప్రపంచానికి ‘బాహుబలి’ అంటే ఇండియా అని గుర్తుపట్టేలా చేసిన ప్రభాస్ లుక్స్ మీద ట్రోలింగ్ చేయడం సరికాదని హైపర్ ఆది హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *