తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రభుత్వ భూముల అమ్మకం సాగింది. శుక్రవారం హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్ భూములు(Khanamet lands) ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా. సరాసరిగా ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 41/14లో మొత్తం 14.91 ఎకరాల భూములను 5 ఫ్లాట్లుగా విభజించి వేలం వేయగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీఎస్‌ఐఐసీ) రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది.
మంజీరా కన్‌స్ట్రక్షన్స్ ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్లు పెట్టి… 2.92 ఎకరాలను రూ.160.60 కోట్లకు దక్కించుకుంది. కాగా కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో మొత్తం 49 ఎకరాలను భూమిని మొత్తం 8 ప్లాట్లుగా విభజించి గురువారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. కోకాపేట భూములు సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలకగా… ఖానామెట్ భూములు సరాసరిగా ఎకరానికి రూ.48.92 కోట్లు పలకడం విశేషం. కోకాపేట భూముల అమ్మకం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం రాగా… ఖానామెట్ భూముల ద్వారా టీఎస్‌ఐఐసీకి రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది.