ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం నాడు సీబీఐ కోర్టు కేసుల్లో హాజరు కానున్నారు. ఈ సందర్భంగా, ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులకు పంపిన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం, జగన్ రెడ్డి కోర్టుకు కేవలం గంట సేపు మాత్రమే సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఉదయం 11:30 గంటలకు నాంపల్లి కోర్టుకు చేరుకుని, 12:30 గంటల వరకు కోర్టులో ఉంటారని షెడ్యూల్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌పై “కోర్టుకే సమయం ఇచ్చిన జగన్” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
జగన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులు 2012లో ప్రారంభమైనవి. వీటిలో ముఖ్యంగా అక్రమ ఆస్తులు (Disproportionate Assets), క్విడ్ ప్రో క్వో (Quid Pro Quo – మనీ లాండరింగ్), కొడి కత్తి కేసు మొదలైనవి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి కోర్టు హాజరు నుంచి మినహాయింపు తీసుకున్న జగన్, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ‘బిజీ’గా ఉన్నారని వాదనలు చేస్తున్నారు. ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించగా, ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని కోరారు. అయితే, కోర్టు ఆ అభ్యర్థనను కుదరదని స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న షెడ్యూల్ ప్రకారం, జగన్ ఉదయం 9:00 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి, ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. కోర్టులో గంట సమయం గడిపిన అనంతరం, 12:30 నుంచి తన నివాసం అయిన లోటస్ పాండ్‌కు వెళ్తారు. అయితే, ప్రస్తుతం లోటస్ పాండ్‌లో జగన్ ఉండటం లేదు; కేవలం భోజనం చేసేందుకు మాత్రమే వెళ్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనమవుతారు.