దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ ‘వారణాసి’ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే ‘గ్లోబ్ త్రాటర్’ అనే ఈవెంట్‌లో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించగా, ఈ టైటిల్ తమదేనంటూ ఒక చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.
సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్‌ను తాము ముందుగానే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నామని ఆ సినిమా నిర్మాత విజయ్ కె తెలిపారు. తమ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి ఈ టైటిల్‌ను ప్రకటించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు సమర్పించారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన ఛాంబర్, ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలను మీడియాకు విడుదల చేసింది. ఈ వివాదం కారణంగా, భారీ అంచనాలున్న రాజమౌళి-మహేశ్ బాబు సినిమా ప్రారంభంలోనే టైటిల్ సమస్యను ఎదుర్కొంటోంది.