ఆమె ఒక రాక్షసి, పార్టీకి పట్టిన శని అంటూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్..

బీఆర్ఎస్ నుంచి వేటుకు గురైన కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితను ‘రాక్షసి’ అని సంబోధిస్తూ, ఆమె పుట్టడమే బాధాకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత నిరంతరం విమర్శలు చేస్తున్నారని, “హరీష్ రావు గురించి ఒక్కరోజు మాట్లాడకపోయినా ఆమెకు పొద్దు గడవదు” అని మండిపడ్డారు. కేవలం హరీష్ రావునే కాకుండా, కన్న తండ్రి కేసీఆర్, సొంత అన్న కేటీఆర్‌లను కూడా విమర్శిస్తూ పార్టీ నాశనం కోరుకుంటున్నట్లుగా ఆమె వైఖరి ఉందని ప్రభాకర్ ధ్వజమెత్తారు.

 

హరీష్ రావు మెదక్ జిల్లా ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి అని, ఏడు స్థానాలను గెలిపించుకున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ కొనియాడారు. అలాంటి నేతను విమర్శించే నైతికత కవితకు లేదన్నారు. “నిజామాబాద్‌లోనే చెల్లని రూపాయి, మెదక్‌లో ఎలా చెల్లుతుంది?” అని ప్రశ్నించారు. “నువ్వు ‘కర్మ’ గురించి మాట్లాడుతున్నావు, లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం నీ కర్మ కాదా? ఎంపీగా గెలవకపోవడం నీ కర్మ కాదా?” అని ఆ నేత సూటిగా నిలదీశారు.

 

కవిత మాటల వెనుక కాంగ్రెస్ లబ్ధి ఉందని, రేవంత్ రెడ్డిని సంతోషపెట్టడానికే ఆమె సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. “రేవంత్ రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీలు సక్రమంగా కాపాడుకోవడానికే, ఆ బంధం కోసమే” కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై దాడి చేస్తున్నారని, ఈ విషయం ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.

 

కవిత ఈ సమాజం క్షమించకూడని తప్పులు చేస్తున్నారని, ఆమె “బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని” అని చింతా ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. ఆమె వేసే ప్రతి అడుగు పార్టీకి నష్టం కలిగించేలా ఉందన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *