తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 నెలలుగా పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అన్ని ఎన్నికలను ఒకేసారి కాకుండా.. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, కొంత వ్యవధి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణమైన బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత కొరవడింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నించినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ నిర్ణయాన్ని ఆమోదించలేదు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సైతం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో.. ప్రభుత్వానికి 50 శాతం రిజర్వేషన్ల అమలు మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి, ప్రణాళికపై వివరణ కోరుతూ హైకోర్టులో ఇప్పటికే దాఖలైన కేసు ఈనెల 24న విచారణకు రానుంది. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి మార్గం సుగమం అవుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికల నిర్వహణపై త్వరలో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.