ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్..!

సైబర్ కేటుగాళ్లు రోజుకో రకంగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వారి భారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య డిజటల్ అరెస్టుకు గురయ్యారు. అప్రమత్తమైన పుట్టా సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

పుట్టా సుధాకర్ భార్య ఖాతా నుంచి రూ. 1.7 కోట్లు మాయం చేసినట్లు ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ కు పాల్పడిని నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ ఉన్నట్లు సమాచారం.

 

స్వయానా ఎమ్మెల్యేనే సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించడం మైదుకురులో కలకలం రేపింది. ఎమ్మెల్యే భార్యకు ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు.. తమను తాము సీబీఐ, బ్యాంక్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె పేరుతో మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు బెదిరించారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు. భయపడ్డ ఎమ్మెల్యే భార్య సుమారు రూ. 1.70 కోట్లు బదిలీ చేసినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

 

కాగా, గత నెలలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఇదే తరహాలో సైబర్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై సైబర్ క్రైం నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, ఉగ్రవాదుల ఖాతా నుంచి రూ. 3 కోట్లు ఎమ్మెల్యే అకౌంట్ కు బదిలీ అయినట్లు సైబర్ మోసగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఫేక్ సీబీఐ నోటీసులు, బ్యాంక్ ఫ్రీజ్ చేస్తామని పలు ఫేక్ డాక్యుమెంట్లు చూపడంతో ఎమ్మెల్యే ఖంగారు పడ్డాడు. వారు తమకు డబ్బు పంపిస్తే ఆ కేసును క్లోజ్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం డబ్బు పంపాలని వారు డిమాండ్ చేయడంతో, ఎమ్మెల్యే వారి ఖాతాకు రూ. 1.07 కోట్లు బదిలీ చేశారు. ఆ తరువాత మరో రూ. 60 లక్షలు బదిలీ చేయాలని చెప్పడంతో తాను మోసపోయానని ఎమ్మెల్యే తెలుసుకొని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫర్యాదు చేశాడు.

 

తెలియని నెంబర్ల నుంచి కాల్ చేసి పోలీసులమని చెబితే నమ్మవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఆ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలని సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఉండదని, అనవసరమైన ట్రాప్ లో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, లేదా అలాంటి కాల్స్ వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి లేదా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (040) 29320049 కాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియని నెంబర్లు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *