నియామకాలపై ఎఫెక్ట్‌

కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు 2019లో ఇదే నెలతో పోలిస్తే 18 శాతం మేర పడిపోయాయని నౌక్రి జాబ్‌స్పీక్‌ సూచీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచీ నియామకాలు సగటున 5.75 శాతం వృద్ధినే నమోదు చేస్తుండటం మందగమన సంకేతాలు పంపగా కరోనా మహమ్మారితో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయి. నౌక్రీ.కాం వెబ్‌సైట్‌లో ప్రతినెలా నమోదయ్యే జాబ్‌ లిస్టింగ్స్‌ ఆధారంగా నౌక్రీ జాబ్‌స్పీక్‌ పేరిట ప్రతినెలలో హైరింగ్‌ కార్యకలాపాలను వెల్లడిస్తుంది. తాజాగా నియామక కార్యకలాపాలు హోటల్‌, రెస్టారెంట్లు, ట్రావెల్‌, ఎయిర్‌లైన్స్‌, రిటైల్‌, ఆటో అనుంబంధ రంగాలు, బీమా, ఫార్మా, ఫైనాన్స్‌, ఐటీ సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో భారీగా పడిపోయాయి.

ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిందని వెల్లడించింది. ఇక​ ఢిల్లీలో నియామక కార్యకలాపాలు 26 శాతం తగ్గగా, చెన్నై..హైదరాబాద్‌ల్లో 24 శాతం, 18 శాతం మేర తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్‌ రంగాల్లో నియామకాల ప్రక్రియ వరుసగా 66 శాతం, 43 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్‌లో నియామక కార్యకలాపాలు 18 శాతం తగ్గగా హాస్పిటాలిటీ రంగంలో 62 శాతం, ఆటో అనుబంధ రంగాల్లో 46 శాతం, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాల్లో 40 శాతం మేర నియామక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్‌-19 సంక్షోభం ప్రభావంతో హైరింగ్‌ కార్యకలాపాల్లో 18 శాతం తగ్గుదల నమోదైందని..జనవరి నుంచే ఈ ట్రెండ్స్‌ కనిపించాయని నౌక్రీ.కాం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *