బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవు: కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాలను కూలంకషంగా విశ్లేషించి, సమీక్షిస్తామని తెలిపారు. సమీక్ష పూర్తయిన తర్వాత ఈ అంశంపై తప్పకుండా చట్టపరంగా ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.

బీహార్ ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో ఓటమి నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ఫలితాలపై లోతుగా చర్చించారు.

ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 6 సీట్లకే పరిమితమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ కూటమి మొత్తం మీద 35 స్థానాలతో సరిపెట్టుకోగా, బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 200కు పైగా స్థానాలు గెలుచుకుంది. ఈ భారీ ఓటమి నేపథ్యంలోనే కాంగ్రెస్, ఆర్జేడీ కూటములు ఈ ఫలితాలను ప్రశ్నిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *