ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. రూ. 1100 కోట్ల కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ ‘కల్కి’ టైటిల్‌తో ప్రభాస్ సినిమా చేయడం ద్వారా, తన తండ్రి దివంగత నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కల నెరవేరింది.
ప్రభాస్ తండ్రి ఆగిపోయిన ‘కల్కి’ ప్రాజెక్ట్
ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు 1989 – 90 సమయంలో ‘కల్కి’ టైటిల్‌తో ఒక సినిమా నిర్మించాలని ప్లాన్ చేశారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అప్పటికే కో-డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ వర్మకు దర్శకత్వం అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా, అప్పటికి సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కీరవాణిని ఈ ‘కల్కి’ మూవీతోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన భావించారు.
ఆగిపోయిన ప్రాజెక్ట్, నెరవేరిన కల
‘కల్కి’ సినిమా నటీనటుల ఎంపిక పూర్తయి, కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. సూర్యనారాయణ రాజు గారు దానిని పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు ఆగిపోయిన తన తండ్రి సినిమా టైటిల్‌తో ప్రభాస్ సినిమా చేయడమే కాకుండా, రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్టు కొట్టారు. అలా తండ్రి కల నెరవేరింది. కల్కితో పరిచయం కావాల్సిన కీరవాణి చివరకు ‘మనసు మమత’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సూర్యనారాయణ రాజు గారు అంతకుముందు కృష్ణంరాజుతో కలిసి ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.