బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా, కూటమిలోని భాగస్వామ్య పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)) ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి, ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఎల్జేపీ(ఆర్‌వీ) పార్టీకి బీహార్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ తర్వాత కూటమిలో మూడవ అతిపెద్ద పార్టీగా LJP(RV) అవతరించింది.
LJP(RV) పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఎన్నికలకు ముందే హింట్ ఇచ్చారు. ఈ వారం ప్రారంభంలో విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా, కూటమి మెజారిటీ సాధిస్తే తమ పార్టీకి ఆ పదవి వస్తుందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకుగాను, ఎన్డీఏ దాదాపు 200 స్థానాల్లో గెలుపు/ఆధిక్యంతో ఉండగా, కూటమిలో LJP(RV)కి కేటాయించిన 29 సీట్లలో 20 కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. నితీష్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో, బీజేపీతో పాటు ఎల్జేపీ(ఆర్‌వీ)కి డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నాయి.
అయితే, ఉప ముఖ్యమంత్రి పదవిని మీరే చేపడతారా అని అడిగినప్పుడు, చిరాగ్ పాశ్వాన్ “నో” అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా (Union Minister of Food Processing Industries) పనిచేస్తున్నారు. తాను ఆ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. “ప్రస్తుతానికి నేను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోను. కానీ కూటమి గెలిస్తే, మా పార్టీ నుంచి ఒక నాయకుడు కచ్చితంగా ఆ పదవి చేపడతారు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ గ్రాండ్ విక్టరీ ఎల్జేపీ(ఆర్‌వీ)కి రాష్ట్ర స్థాయిలో పెద్ద బూస్ట్‌ను ఇచ్చింది.