చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టపడే కార్టూన్ స్పైడర్ మ్యాన్ . దీనిపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈలలు కొట్టించాయి. సినిమాలో ఎవరికైనా కష్టం ఉందనగానే స్పైడర్ మ్యాన్ చటుక్కున ప్రత్యక్షమవుతాడు. ఎంతటి సాహసానికైనా పూనుకుని వారిని కాపాడతాడు. అలాంటి స్పైడర్ మ్యాన్‌కు నిజ జీవితంలో ఓసారి కష్టం వచ్చింది. అప్పుడు ఓ యాచకుడు అతన్ని ఆదుకుని గండం నుంచి గట్టెక్కించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన టామ్ హాలండ్ లండన్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ట్రాలీని తీసుకోడానికి ఒక పౌండ్ (భారత కరెన్సీలో రూ.92) రుసుము ఇవ్వాలి. అయితే ఈ హీరో దగ్గర చిల్లర లేక ఇబ్బందిపడుతున్నాడు.దీన్ని దూరం నుంచి గమనించిన ఓ యాచకుడు అతనికి ఆ పౌండ్‌ను అందించి సాయపడ్డాడు. అయితే షాపింగ్ అనంతరం టామ్ ఆ భిక్షగాడి దగ్గరకు వెళ్లి అతనిచ్చిన ఒక్క పౌండ్‌ను తిరిగివ్వడమే కాకుండా మరో వంద పౌండ్లను అదనంగా ఇచ్చాడు. ఇది అక్కడే ఉన్న ఓ తల్లీకూతుళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. స్పైడర్ మ్యాన్ గొప్ప మనసుతో అతనికి రెట్టింపు సాయం చేయడాన్ని చూసి తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని వారు పేర్కొన్నారు. 23 యేళ్ల టామ్ హాలండ్.. స్పైడర్ మ్యాన్ నటి జెండయాతో డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.