బెట్టింగ్ యాప్ల కేసులో సిట్ (SIT) అధికారుల విచారణకు హాజరైన సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు కోరారు. 2016లో తాను ఒక యాప్ను ప్రమోట్ చేశానని, అయితే ఆ యాప్ను 2017లో నిషేధించిన తర్వాత తాను వెంటనే ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. తాను తెలిసి తప్పు చేయకపోయినా, “తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే” అని ఆయన అంగీకరించారు.
తాను చేసిన ఈ పొరపాటుకు ప్రజలకు క్షమాపణలు కోరుతున్నానని ప్రకాశ్ రాజ్ అభ్యర్థించారు. సిట్ అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరించానని, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, అన్ని ఆధారాలు మరియు రికార్డులను అధికారులకు సమర్పించానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ చేయనని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ల కారణంగా ఎంతోమంది యువత డబ్బులు పోగొట్టుకుని, ప్రాణాలు కోల్పోవద్దని ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ యాప్స్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, అనేక విధాలుగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, యువత ఇలాంటి వాటికి ఆకర్షితులు కాకుండా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.