ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆర్సీబీకి కీలక సూచన చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ జట్టు కూర్పు బాగానే ఉందని, కేవలం ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆకాశ్ చోప్రా సూచించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు లియామ్ లివింగ్ స్టోన్ మరియు రసిక్ సలామ్ దార్. గత సీజన్‌లో ఈ ఇద్దరూ తమ ప్రదర్శనతో నిరాశపరిచారని చోప్రా పేర్కొన్నారు. “జట్టు కూర్పు సెట్ అయినప్పుడు, పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అదరగొట్టింది. లివింగ్ స్టోన్, రసిక్ మాత్రం నిరాశపరిచారు” అని ఆయన వివరించారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లివింగ్ స్టోన్‌ను ఆర్సీబీ భారీ మొత్తమైన ₹8.75 కోట్లకు, రసిక్ సలామ్ దార్‌ను ₹6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరినీ విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ పర్స్‌లో దాదాపు ₹15 కోట్లు అదనంగా చేరే అవకాశం ఉంది. ఈ డబ్బుతో మిడిల్ ఆర్డర్‌లో ఒక నాణ్యమైన బ్యాటర్‌ను మరియు బ్యాకప్ ఇండియన్ బౌలర్‌ను కొనుగోలు చేయడానికి ఆర్సీబీ వేలంలోకి వెళ్లాలని ఆకాశ్ చోప్రా సూచించారు.