ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరొక తుపాను ముప్పు పొంచి ఉందని ఇస్రో (ISRO) తెలిపింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో అంచనా వేసింది. ఇది వాయుగుండంగా బలపడి, తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ కూడా తెలిపింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన ‘మొంథా తుపాను’ ప్రభావంతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయి, రైతులు పంట నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో, ఈ కొత్త తుపాను ముప్పు హెచ్చరిక ప్రజలను వణికిస్తోంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో నేడు (నవంబర్ 11, 2025) కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నందున ఈ వానలు పడతాయని పేర్కొంది. అయితే, ఏపీలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని, అదే సమయంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలోనూ, ఏజెన్సీ ఏరియాలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇక తెలంగాణలో చలిగాలుల తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది, దీంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. చలి తీవ్రత పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు.