జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారీ విజయం సాధించారు. జైష్-ఎ-మొహమ్మద్ (JEM) మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGUH) ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, దేశంలో జరిగే భారీ ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు. వైట్ కాలర్ ముసుగులో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న రాడికలైజ్డ్ నిపుణులు మరియు విద్యార్థులతో కూడిన ఈ టెర్రర్ ఎకోసిస్టమ్‌ను పోలీసులు గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పట్టుబడిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు. అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని బన్‌పోరా నౌగామ్‌లో JEM పోస్టర్లు వెలువడిన చిన్న క్లూతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు.
ఈ వైట్ కాలర్ బృందం ఉగ్ర సంస్థల ప్రచారం, సమన్వయం, నిధుల తరలింపు, మరియు లాజిస్టిక్స్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరు సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో నిధులు సేకరిస్తూ, తీవ్రవాదాన్ని ప్రేరేపించడం, సంస్థల్లో యువతను చేర్చుకోవడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు IED తయారీకి అవసరమైన సామగ్రిని సేకరించడంలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో భాగంగా శ్రీనగర్, అనంతనాగ్, గండర్‌బాల్, షోపియన్‌లలో సోదాలు నిర్వహించడంతో పాటు, హర్యానాలోని ఫరీదాబాద్‌లో మరియు యూపీలోని సహరాన్‌పూర్‌లో కూడా ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సోదాలు జరిపారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నేరారోపణలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు (చైనీస్ స్టార్ పిస్టల్, బెరెట్టా పిస్టల్, AK-56 రైఫిల్, AK క్రింకోవ్ రైఫిల్), మందుగుండు సామగ్రి, మరియు 2900 కేజీల IED తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కుట్రలను ఛేదించిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు, వీరిలో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై మరియు డాక్టర్ అడీల్‌తో పాటు ఒక మసీదు ఇమామ్ (మోల్వి ఇర్ఫాన్ అహ్మద్) కూడా ఉన్నారు. మరికొంత మంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.