హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం లగ్జరీ జీవనశైలికి ప్రసిద్ధి చెందినా, ఓటు హక్కు వినియోగంలో మాత్రం ఇక్కడి ప్రజలు వెనుకబడి ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ప్రతి ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడం లేదు. 2018 ఎన్నికల్లో 47.2 శాతం, 2023 ఎన్నికల్లో 47.58 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ప్రభుత్వం సెలవు ప్రకటించినా, ‘ఓటు వేయడం వల్ల ఏమవుతుంది?’ అనే నిర్లిప్త భావన లేదా లాంగ్ వీకెండ్‌కు నగర బయటకు వెళ్లడం వంటి ధోరణి ప్రధానంగా ఉన్నతవర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కు పట్ల ఈ నిర్లక్ష్యం విచారకరం. విభిన్న వృత్తులలో ఉన్నవారు మరియు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యువత కూడా తమ ప్రజాస్వామ్య పాత్ర పట్ల నిరాసక్తత చూపడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా అత్యంత కీలకంగా మారడంతో, విశ్లేషకులు ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలు కూడా స్లమ్ ప్రాంతాల నుండి గేటెడ్ కమ్యూనిటీల వరకూ ప్రతి ఓటరిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువత, ఐటీ ఉద్యోగులు, మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, అప్పుడే జూబ్లీహిల్స్ పేరుకే కాదు, ప్రజాస్వామ్య చైతన్యంలోనూ ‘లగ్జరీ’గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.