2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం వేదికలపై పూర్తి స్పష్టత వచ్చింది. నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ మైదానంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ఈ సారి కూడా లక్షమందికిపైగా ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న ఈ మైదానం ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే, ముంబయిలోని వాంఖడే స్టేడియం ఒక సెమీఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. అయితే, పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్‌కి లేదా ఫైనల్‌కి అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్‌లు తటస్థ వేదిక అయిన కొలంబోలోనే జరుగుతాయి. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2027 వరకు భారత్ – పాకిస్తాన్ జట్లు తటస్థ వేదికల్లోనే ఆడవలసి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో జరగబోయే ఇతర మ్యాచ్‌లు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా మైదానాల్లో నిర్వహించనున్నారు.
ఈ జాబితాలో బెంగళూరుకు చోటు దక్కకపోవడం గమనార్హం. గత ఏడాది ఐపీఎల్ విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత అవసరమైన అనుమతులు లభించకపోవడం వల్ల కర్ణాటక క్రికెట్ సంఘం నుంచి ఆ మైదానాన్ని తొలగించినట్లు సమాచారం. శ్రీలంకలో కొలంబో సహా మూడు వేదికల్లో కీలక మ్యాచ్‌లు జరిగేలా ఐసీసీ ప్లాన్ చేస్తోంది.