మిథున్ చక్రవర్తి సినిమా అడిగితే భయపడ్డా: బాలీవుడ్ అవకాశాలపై నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

సీనియర్ నటి మీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా ఎందుకు చేయలేకపోయానో వివరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఓ సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. “మిథున్ చక్రవర్తి గారి హోటల్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన నా గది దగ్గరకు వచ్చి ‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్?’ అని తరచూ అడిగేవారు. ఆయన పదే పదే అడగటంతో, ఒకానొక దశలో ఆ హోటల్‌కు వెళ్లాలంటేనే భయపడేదాన్ని” అని మీనా వెల్లడించారు. అంత పెద్ద స్టార్ హీరో అన్నిసార్లు అడిగినా డేట్లు సర్దుబాటు కాక చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను హిందీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటానికి గల ప్రధాన కారణాలను కూడా మీనా వివరించారు. తెలుగు, తమిళ భాషల్లో తాను అత్యంత బిజీగా ఉన్న సమయంలోనే హిందీ నుంచి అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఒక్కోసారి రోజుకు నాలుగు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని అని, తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదని ఆమె అన్నారు. అలాంటి తీరిక లేని సమయంలో బాలీవుడ్ సినిమా చేయడం తన వల్ల కాలేదని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాకుండా, బాలీవుడ్ సినిమాల షూటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని, అనుకున్న సమయానికి పూర్తికావని అప్పట్లో కొందరు తనను భయపెట్టారని మీనా తెలిపారు. అందుకే అటువైపు చూడాలన్న ఆలోచన కూడా చేయలేదని వెల్లడించారు. మీనా తన సుదీర్ఘ కెరీర్‌లో ‘పర్దా హై పర్దా’ అనే ఒక్క హిందీ చిత్రంలోనే నటించడం గమనార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *