ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థిని అనారోగ్యం కారణంగా అకాల మరణం పాలైంది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి, ఎన్నో ఆశయాలతో అమెరికాలో ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది. బాగా చదువుకొని, కుటుంబానికి అండగా నిలబడాలనే ఆమె ఆశలు, విధి వక్రించడం వల్ల అడియాశలయ్యాయి. చదువు పూర్తయిన కొన్ని రోజులకే అనారోగ్యం రూపంలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామమైన కారంచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజ్యలక్ష్మి మూడు రోజుల క్రితం తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, తనకు జలుబు, ఆయాసంగా ఉందని తెలిపింది. చికిత్స కోసం తొమ్మిదవ తేదీకి డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు గురువారం రాత్రి కుటుంబసభ్యులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత స్నేహితులతో కలిసి నిద్రించిన ఆమె మరుసటి రోజు ఉదయం నిద్రలేవలేదు. ఆమెను లేపడానికి ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని స్నేహితులు తెలిపారు.
రాజ్యలక్ష్మి మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు రామకృష్ణ, నాగమణి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాకుండా, రాజ్యలక్ష్మి మృతదేహాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.