ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అరుదైన వృక్ష సంపదకు నిలయమైన శేషాచలం అడవులను ఆయన పర్యటించి, చెట్లను పరిశీలించారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్ నిరోధానికి మరియు ఎర్రచందనం సంపద పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ఆరు నెలల్లో దీన్ని అమలులోకి తీసుకురాబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఎర్రచందనంపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కల్యాణ్, 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా స్మగ్లింగ్ జరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో దోచుకున్న సొత్తు ఎవరి ఊహలకు అందనంతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ నుంచి తరలిపోయిన ఎర్రచందనాన్ని కర్ణాటక పట్టుకుని వేలం వేయగా, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.140 కోట్ల సొమ్ము వచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు జిల్లాల ఎస్పీలకు, అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక టాస్క్ ఇచ్చామని, స్మగ్లింగ్ నిరోధానికి ఇతర రాష్ట్రాలతో ఒప్పందం కూడా చేసుకుంటామని వెల్లడించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్‌లను ఇప్పటికే గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. స్మగ్లర్ల ఆట కట్టించడానికి మహారాష్ట్రలో నిర్వహించిన ‘ఆపరేషన్ కగర్’ లాంటి ఆపరేషన్ తప్పదని హెచ్చరించారు. ఎర్రచందనం చెట్లు నరికే వృత్తిలోకి స్థానిక ప్రజలు, తమిళనాడు వాసులు ఎవ్వరూ వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.