ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారిగా టైటిల్ సాధించింది. ఈ విజయం తర్వాత భారత క్రీడాకారిణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రతీకా రావల్ మెడలో విన్నింగ్ మెడల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ సమయానికి జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లకు మాత్రమే మెడల్స్ ఇస్తారు. చివరి లీగ్ మ్యాచ్‌లో గాయపడినందున, సెమీఫైనల్, ఫైనల్‌కు దూరమైన ప్రతీకా రావల్‌కు మెడల్ దక్కలేదు.
ప్రతీకా రావల్ టోర్నీలో విశేషంగా రాణించింది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచులలో ఆమె 308 పరుగులు చేసింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక మ్యాచులో సెంచరీతో చెలరేగిపోయింది. అయితే, చివరి లీగ్ స్టేజ్ మ్యాచులో గాయపడటంతో ఆమె ప్లేసులో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. జట్టు విజయంలో భాగమైనప్పటికీ, ఐసీసీ నిబంధనల కారణంగా ఆమెకు మెడల్ దక్కలేదు.
అయితే, ప్రధాని మోదీతో జరిగిన ఫొటో షూట్ సమయంలో ప్రతీకా రావల్ మెడలో మెడల్ కనిపించింది. దీనికి కారణం… జట్టు సభ్యురాలు అయిన అమన్ జోత్ కౌర్ తన మెడల్‌ను ఆమెకు ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది. జట్టు విజయంలో ప్రతీకాకు కూడా గుర్తింపు దక్కాలనే ఉద్దేశంతో అమన్ జోత్ ఈ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఇది కదా నిజమైన క్రీడా స్ఫూర్తి అంటూ నెటిజన్లు అమన్ జోత్ కౌర్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.