కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఓట్ చోరీ’ పేరిట ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఒక బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో 22 ఓట్లు ఉన్నాయని చెప్పారు. స్వీటీ, సీమ, సరస్వతితో పాటు పలు పేర్లతో ఆ మోడల్ ఓటు వేసినట్లు నమోదైందని తెలిపారు. రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఓటర్ 10 పోలింగ్ బూతుల్లో 22 ఓట్లు వేసినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ హరియాణాలో సుమారు 25 లక్షల ఫేక్ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. కేవలం రెండు పోలింగ్ బూతుల్లోనే చెక్ చేస్తే, ఒకే మహిళ ఫొటో ఏకంగా 223 చోట్ల కనిపించిందని తెలిపారు. ఈ ఫొటోలు వేర్వేరు పేర్లు, వేర్వేరు వయసులు, వేర్వేరు అడ్రస్‌లతో ఉన్నాయని, కొన్ని ఫొటోల్లో ముఖాన్ని బ్లర్ చేసినట్లు ఉందని ఆయన అన్నారు. అంతేకాక, ఒకే ఇంటి అడ్రస్ మీద 501 మంది ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తమ పరిశోధనలో హరియాణాలో 5,21,619 డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించిందని రాహుల్ తెలిపారు. అలాగే, 19 లక్షల బల్క్ ఓటర్లు నమోదయ్యారని, 93,000 మంది ఓటర్ల అడ్రస్ సరైంది కాదని తమ పార్టీ గుర్తించినట్టు చెప్పారు. ఆసక్తికరంగా, హరియాణా ఎన్నికల్లో యూపీకి చెందిన ఇద్దరు బీజేపీ సర్పంచ్‌లు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు రాహుల్ గాంధీ ఆరోపించారు.