పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైడ్ అయ్యారా?: జూబ్లీహిల్స్ ప్రచారంలో యెన్నం, అనిరుధ్ రెడ్డి గైర్హాజరుపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరుకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పార్టీ విధానాలపై తరచూ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారిందని, సీఎం రేవంత్ వారిపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

యొన్నం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఏటా రూ.25 కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకుంటున్నారు. మరోవైపు, అనిరుధ్ రెడ్డి గతంలో పార్టీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టడం, సీఎం రేవంత్‌కు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నారన్న ప్రచారం జరగడం వంటివి కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారాయట. ప్రభుత్వ విధానాలపై విమర్శలు, హైకోర్టు మెట్లు ఎక్కడం వంటి చర్యలతో సీఎం రేవంత్ వారిపై గుర్రుగా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ, సీఎం సొంత జిల్లాకు చెందిన యెన్నం, అనిరుధ్ రెడ్డిలకు ఎక్కడా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పాలమూరు పాలిటిక్స్‌లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను సైడ్ చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఈ ఇద్దరు నేతలు ఏమాత్రం తగ్గడం లేదట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *