రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. రోడ్లు బాగాలేకపోవడం వల్లనో, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయకపోవడం వల్లనో ప్రమాదాలు జరగవని ఆయన స్పష్టం చేశారు.
గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతుంటాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగి మరణించిన సందర్భాలు లేవా అని ఆయన ప్రశ్నించారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎంతో బాగున్నప్పటికీ, దానిపై ఎన్నో ప్రమాదాలు జరిగాయని మల్లు రవి గుర్తు చేశారు. “రోడ్డు బాగుందా లేదా అనే దాని వల్ల ప్రమాదాలు జరగవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు, మా ప్రభుత్వంలోనూ చనిపోయారు” అని ఆయన అన్నారు. ప్రమాదాన్ని తాము సమర్థించడం లేదని, అలా జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డ ఆయన, ఈ దుర్ఘటనను రాజకీయాలకు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు.