Covid-19 మహమ్మారి విజృంభిస్తూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలన్న సూచనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు నిపుణులు ఏప్రిల్ 14 అనంతరం కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని కోరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోందని ఉన్నతస్ధాయి అధికార వర్గాలు వెల్లడించాయి. లాక్‌డౌన్‌పై సంప్రదింపులు జరుగుతున్నాయని, అయితే ఇంతవరకూ తుదినిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను దశల వారీగా విరమించేందుకు ప్రణాళికతో ముందుకురావాలని మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే.ఇక లాక్‌డౌన్ పొడిగింపుపై దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పకొచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్‌ను కొనసాగించక తప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారి నుంచి మనం ప్రజల్ని రక్షించుకోవాలని, ఆర్థిక వ్యవస్థను తర్వాత చక్కదిద్దుకోవచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సైతం లాక్‌డౌన్‌ను తక్షణమే ఉపసంహరించరాదని, దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై శాస్ర్తీయ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని అసోం ప్రభుత్వం వెల్లడించింది.