ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు.
ఈసారి ధాన్యం విక్రయించాలనుకునే రైతుల కోసం ప్రభుత్వం ఒక సులభమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రైతులు తమ ఫోన్ నుంచి 7337359375 అనే నంబర్‌కు “HI” అని సందేశం పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాణ్యమైన గోనె సంచులు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, రవాణా సౌకర్యాల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 3వ తేదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆరుగొలను గ్రామంలో మంత్రి ఈ కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.