పాకిస్తాన్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని, భారత్ సింధు నదీ ప్రవాహాన్ని నియంత్రించగలిగితే ఆ దేశంలో వినాశనం తప్పదని పర్యావరణ ముప్పు నివేదిక 2025 హెచ్చరించింది. పాకిస్తాన్‌లో 80 శాతం వ్యవసాయం సింధు నదీ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి ఉంది. ఈ బేసిన్ అత్యధిక భాగం భారత్‌లో ఉండటం మరియు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేయడం వంటి పరిణామాలు పాకిస్తాన్‌కు తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని పెంచుతున్నాయని సిడ్నీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) నివేదిక వెల్లడించింది.
పాక్‌లోని సింధు నది ఆనకట్టల్లో కేవలం 30 రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదు. దీని వల్ల దీర్ఘకాలం పాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని నివేదిక హెచ్చరించింది. భారత్ నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకపోయినా లేదా మళ్లించలేకపోయినా.. ఆనకట్ట కార్యకలాపాలలో చిన్న సర్దుబాట్లు చేసినా చాలు పాక్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా వేసవి వంటి కీలక సమయాల్లో ఈ ప్రభావం పాక్ జనసాంద్రత కలిగిన వ్యవసాయ ప్రాంతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది.
సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా భారత్ పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల జలాల పంపిణీ బాధ్యతలకు కట్టుబడి లేదు. ఇటీవల, మే నెలలో పాకిస్తాన్‌కు తెలపకుండానే చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బాగ్లిహార్ ఆనకట్టల వద్ద భారత్ రిజర్వాయర్ ఫ్లషింగ్ నిర్వహించడం, పాక్‌లో వరద లాంటి పరిస్థితిని సృష్టించింది. ఇది నది నిర్వహణపై భారత్‌కు ఉన్న వ్యూహాత్మక పరపతికి అద్దం పడుతుంది. ఇందుకు తోడు, ఆఫ్ఘనిస్తాన్ కూడా కునార్ నదిపై ఆనకట్ట నిర్మించే ప్రణాళికను వేగవంతం చేయడంతో పాకిస్తాన్ భవిష్యత్తులో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.