వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వే మరో నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు ఆమోదం తెలిపింది. అత్యాధునిక హంగులు, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడం వంటి కారణాల వల్ల ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నాలుగు కొత్త సర్వీసులతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 164కు చేరుకుంది.
కొత్తగా ఆమోదం పొందిన నాలుగు మార్గాలు ముఖ్యమైన రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయనున్నాయి. ఆ రూట్లు:
- బెంగళూరు – ఎర్నాకులం (కర్ణాటక-కేరళ)
- ఫిరోజ్‌పూర్ కాంట్ – ఢిల్లీ (పంజాబ్-ఢిల్లీ)
- వారణాసి – ఖజురహో (ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్)
- లక్నో – సహరాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్ అంతర్గత కనెక్టివిటీ)
ఈ రైళ్లు కూడా కవచ్ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ, మెరుగైన అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు, సీసీటీవీ కెమెరాలు, వికలాంగ ప్రయాణీకులకు అనువుగా ప్రత్యేక మరుగుదొడ్లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో రానున్నాయి. ఈ కొత్త రైళ్లకు ఆమోదం మాత్రమే లభించినప్పటికీ, ఇవి ఎప్పటి నుంచి నడుస్తాయనే ఖచ్చితమైన తేదీలు మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది.