పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని జిల్లా కేంద్రాల నుంచి అయోధ్య, అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ, శబరిమలై, తిరుపతి, రామేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
ఆదిలాబాద్ డిపో నుంచి అరుణాచలానికి నవంబర్ 8న బయలుదేరే ప్రత్యేక బస్సు కాణిపాకం, వెల్లూరు, జోగులాంబ క్షేత్రాల మీదుగా వెళ్తుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఒక్కో ప్రయాణికుడికి రూ.5,200 చార్జి వసూలు చేయనున్నారు. అలాగే, నిర్మల్ నుంచి కాశీ, అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు, దీనికి ఒక్కొక్కరికి రూ.6,400 చార్జీగా నిర్ణయించారు. మంచిర్యాల నుంచి శ్రీశైలానికి నడపనున్న ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.5,700 చార్జి వసూలు చేస్తారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా బస్సులను నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా కార్తీక మాసంలో భక్తులు గంగా స్నానాలు, దైవ దర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం టీజీఆర్టీసీ తక్కువ ధరలకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.