భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌కు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అయితే, ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభకు తప్పనిసరిగా ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానించినప్పటికీ, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో లిటిగేషన్‌లో ఉండటంతో ఆయన ఎమ్మెల్సీ కావడం అంత సులభం కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. గత బీఆర్‌ఎస్ హయాంలో గవర్నర్ తిరస్కరించిన నామినేషన్ స్థానంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు నిలిపివేసింది. ఈ లీగల్ చిక్కులు తేలే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు, అజారుద్దీన్ పై దేశద్రోహం వంటి తీవ్రమైన కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ఆరు నెలల్లోపు గవర్నర్ ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు బహిరంగంగా వ్యాఖ్యానించారు.
ఆరు నెలల్లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, మంత్రి పదవిలో కొనసాగడానికి కొన్ని రాజకీయ, రాజ్యాంగ వెసులుబాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కారణంగా అనర్హత వేటు పడితే, ఆ ఉపఎన్నికలో అజారుద్దీన్‌ను పోటీకి దింపే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తోంది. మరో వ్యూహం ఏంటంటే, ఆరు నెలల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి కొత్తగా మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం రాజ్యాంగంలో ఉంది. గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణ చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి.