టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అతడు ముంబై ఇండియన్స్‌ను వదిలి కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో (కేకేఆర్) జాయిన్ అవుతాడనే వార్తలు గత రెండు రోజులుగా హల్‌చల్ చేశాయి. ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న సందర్భంగా కేకేఆర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్‌కు ఒక నెటిజన్ “కేకేఆర్‌కు రోహిత్ శర్మ వస్తున్నాడా?” అని అడుగగా, అందుకు కేకేఆర్ “కన్ఫార్మ్.. వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్” అంటూ రిప్లై ఇచ్చింది. అదే సమయంలో రోహిత్ స్నేహితుడు అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులు కానున్నట్లు వార్తలు రావడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ ముంబై ఇండియన్స్ (ఎంఐ) సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించినట్లు అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది సేపటికి ముందే ఎంఐ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ముంబై ఇండియన్స్ లోగోతో ఉన్న రోహిత్ శర్మ ఫోటోను పోస్ట్ చేస్తూ, “రేపు మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు. అది మాత్రం నిజం. కానీ రాత్రి వేళలో ఉదయించడు. అది కష్టమే కాదు అసాధ్యం” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ ద్వారా రోహిత్ శర్మ ముంబైతోనే ఉంటాడని, ఎక్కడికీ వెళ్లబోడని ఎంఐ పరోక్షంగా స్పష్టం చేసింది.
2026 సీజన్‌కు ముందు రోహిత్ ముంబైను వీడుతాడనే వార్తలు రావడానికి ప్రధాన కారణం, రెండేళ్ల క్రితం ఆయన్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించడం. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరిన రోహిత్ శర్మ, ఆ జట్టుకు 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో మొత్తం ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించాడు. ఈ నేపథ్యంలో, ఎంఐ ఇచ్చిన తాజా క్లారిటీతో రోహిత్ ఫ్యాన్స్‌కు ఊరట లభించినట్లయింది.