ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మొంథా తుఫానును ఎదుర్కోవడంలో సమర్థవంతమైన పాలనను ప్రదర్శించి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. తుఫాను హెచ్చరికలు అందిన నాటి నుంచి ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసింది. దీనికోసం ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళిక (మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహాబిలిటేషన్, నార్మల్సీ) ను అమలు చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) సెంటర్ నుంచి నిరంతరం తుఫాను కదలికలను పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, మంత్రులు, అధికారులు పూర్తి స్థాయిలో పాలుపంచుకోవడం వంటి చర్యలతో తుఫాను తీరాన్ని తాకినా ప్రజల జీవితాలను తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ విపత్తు నిర్వహణలో ప్రభుత్వం సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1.1 కోట్ల సందేశాలు పంపారు. అంతేకాకుండా, ఆర్టీజీ సెంటర్ నుంచే సెల్‌ఫోన్ ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్‌ను ఆపరేట్ చేసే విధానాన్ని, సెల్‌ఫోన్ సిగ్నల్ లేని చోట శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పని చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ టెక్నాలజీ వినియోగం వల్ల లంక గ్రామాలతో సహా అన్ని ప్రాంతాల ప్రజలను లక్ష మందికి పైగా సురక్షితంగా పునరావాస శిబిరాలకు తరలించడం సులువైంది. దీని ఫలితంగా రాష్ట్రంలో ప్రాణనష్టం లేకుండా చేయగలిగారు. బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్‌ల ద్వారా గుర్తించి రక్షించడం టెక్నాలజీ పాత్రకు నిదర్శనం.
ముందస్తు ప్రణాళికలో భాగంగా, పునరావాస శిబిరాలను ముందే సిద్ధం చేసి, బాధితులకు ఆహారం, వసతి, మందులు అందుబాటులో ఉంచారు. కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం ద్వారా పంట మరియు నగరాల్లో నీటి నిల్వ నష్టాన్ని తగ్గించారు. విద్యుత్ స్థంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా వెంటనే పునరుద్ధరించడానికి వాహనాలను, సామాగ్రిని సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి సమీపంలో వచ్చిన భారీ బోటును అలెర్ట్ మెకానిజం ద్వారా గుర్తించి, చాకచక్యంగా ఒడ్డుకు చేర్చడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ సమర్థవంతమైన చర్యల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.