“నా సినిమా గురించి గొప్పగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు”: ‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు (అక్టోబర్ 31) విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ, తాను రవితేజ గారి అభిమానినని, ఆయన సినిమాలలో ‘వెంకీ’ అంటే చాలా ఇష్టమని, తన తొలి సినిమా ఆయ‌న‌తోనే ఉంటుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను రవితేజ గారే పెట్టారని దర్శకుడు భాను తెలిపారు. ఈ సాలిడ్ టైటిల్‌కు తగినట్టుగానే సీన్స్‌ను డిజైన్ చేసుకున్నామని, సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, హైపర్ ఆది మాట్లాడుతూ, ‘ధమాకా’ సినిమా తర్వాత నుంచి తాను రవితేజ గారి సినిమాలలో వరుసగా చేస్తూ వెళుతున్నానని, ఈ సినిమాలలో రవితేజగారితో కలిసి తాను చేసే కామెడీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక కథానాయకుడు రవితేజ మాట్లాడుతూ, తన గురించి, తన సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. “ఇలా వచ్చేస్తున్నాయ్… అలా వచ్చేస్తున్నాయ్… బాగా వచ్చేస్తున్నాయ్ అని నేను చెప్పలేను” అని ఆయన పేర్కొన్నారు. అయితే, దర్శకుడు భాను టాలెంట్‌ను మాత్రం ఆయన మెచ్చుకున్నారు. “భాను డైరెక్షన్, అతని రైటింగ్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందనేది మాత్రం నిజం. ఒకటి మాత్రం చెప్పగలను… మనకి మరో కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు” అని రవితేజ చెప్పడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *