భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ సిఫార్సు మేరకు ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24వ తేదీన భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సీజేఐగా నియమించే సంప్రదాయం ప్రకారం, జస్టిస్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేశారు.
జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 14 నెలల పాటు సీజేఐ పదవిలో కొనసాగి, 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆయన 2000 జులై 7న అతి పిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.
జస్టిస్ సూర్యకాంత్ తన సుదీర్ఘ న్యాయ వృత్తిలో ఎన్నో కీలక పదవులను నిర్వహించారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. భారత న్యాయవ్యవస్థలో ఆయన నియామకం ఒక కీలక పరిణామంగా భావించబడుతోంది.