మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌ల వరకు హస్తం పార్టీ నేతలంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నా, రాజగోపాల్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పార్టీ పెద్దలు సైతం ఆయన్ను ప్రశ్నించడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంట్ స్థాన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి, ఈసారి ప్రచారానికి దూరంగా ఉండటం ఆయన అసంతృప్తిని తెలియజేస్తోంది.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం నెరవేర్చకపోవడం ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణం. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖాయమని టాక్ వినిపించినా, సామాజిక సమీకరణాలు మరియు జిల్లా రాజకీయాల కారణంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అప్పటి నుంచి ఆయన గుర్రుగా ఉంటూ, ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. తద్వారా తనకు మంత్రి పదవి రాకుండా సీఎం అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, అనుచరులు ఆయనకు మద్దతుగా ‘మంత్రి రాజగోపాల్ రెడ్డి’, ‘విద్యాశాఖ మంత్రి రాజన్న’ అంటూ పోస్టులు పెట్టి, తాజాగా ‘అప్‌కమింగ్ సీఎం’ అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు.
తాజాగా మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజగోపాల్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించిందట. రెండోసారి విస్తరణ సమయంలో తదుపరి అవకాశం కల్పిస్తామని పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ హామీ ఇచ్చినా, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకపోవడంపై ఆయన ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో ఆయన లేవనెత్తుతున్న అంశాలకు ముఖ్యనేతల దగ్గర సమాధానం లేకపోవడంతో, ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నా ఎవరూ ఏమీ అడగలేకపోతున్నారట. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఆయన్ను ఫోన్ చేయాలంటే ఆలోచిస్తున్నారని సమాచారం. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించి ప్రచారంలోకి దింపుతారా లేదా అనేది చూడాలి.