ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ సిరీస్ కైవసం: రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి, కివీస్ బౌలర్ల ధాటికి 36 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) మాత్రమే కొంతవరకు రాణించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ అద్భుత ప్రదర్శన చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్ రెండు వికెట్లు తీయగా, జాకబ్ డఫీ, జాకరీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంత‌రం 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో రచిన్ రవీంద్ర (54) మరియు డారిల్ మిచెల్ (56 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు బాదగా, ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ జట్టు 33.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, జేమీ ఓవర్టన్ మరియు ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు, ఇప్పుడు నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్‌ను నవంబర్ 1న వెల్లింగ్టన్ వేదికగా ఆడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *